కరోనా మహమ్మారి వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఈ వైరస్‌పై ముమ్మర పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) చేసిన పరిశోధనలో కీలక విషయం వెల్లడైంది. భారత్‌లో నివసించే గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. భారత్‌లో వైద్య పరిశోధనలకు సంబంధించిన జర్నల్‌లో (Indian Journal of Medical Research) దీనిపై ఓ కథనం ప్రచురించారు. పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)తో కలిసి ఐసీఎంఆర్ నిర్వహించిన పరిశోధనలో ఆసక్తికర వివరాలు వెల్లడైనట్లు కథనంలో పేర్కొన్నారు.భారత్‌లో నివసించే రెండు రకాల గబ్బిలాల్లో కరోనా వైరస్‌ను గుర్తించారు. రౌసెటస్, టెరోపస్ అనే రెండు రకాలకు చెందిన గబ్బిలాల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. టెరోపస్ గబ్బిలాలను ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ అని కూడా వ్యవహరిస్తారు. 2018, 2019లో ఈ గబ్బిలాలతోనే కేరళలో నిఫా వైరస్ వ్యాపించింది. నిఫా కారణంగా కేరళలో 17 మంది మరణించిన సంగతి తెలిసిందే. వీటిలో కరోనా వైరస్‌ను గుర్తించడం ఇదే మొదటిసారి.
భారత గబ్బిలాల్లో కరోనా వైరస్.. ఐసీఎంఆర్ పరిశోధనలో సంచలనం